రచయిత : “అమృతవర్షిణి”
సంపుటి 1 సంచిక 8 మే 2023
'ఆ పాట - నా మాట'
ఒకే రాగం - పలు భావాలు
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో వాగ్గేయకారులు* మనకు అందించిన రచనలు, సంగీతం అత్యధిక శాతం భక్తి భావానికి సంబంధించినవి. కొందరు రాముడి పైన, కొందరు అమ్మవారి మీద, మరికొందరు వేంకటేశ్వర స్వామి మీద రచనలు అనేక రాగాలలో, తాళాలలో చేశారు. ఇవి కాక కృష్ణుని మీద, గణపతి మీద, ఆంజనేయుని మీద ఇంకా ఇతరత్రా దేవుళ్ళ పైన ఎంతో మంది ఎన్నో రచనలు చేసి వాటికి శాస్త్రీయ రాగాలు, తాళాలు అనుసంధానం చేసి మనకు అందించారు.
ఆ కృతులు, సంకీర్తనలు దేశ విదేశాలలో ఇప్పటికీ అపూర్వమైన ఆదరణ పొందుతూ, కొత్త కొత్త విద్యార్థులు సంగీత ప్రవేశం చేసి అవి నేర్చుకోవాలి, పాడాలని తహతహ పడుతుంటారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి లింగభేదం, వయోభేదం, కులభేదం, జాతిభేదం లాంటివి అడ్డం రాకపోవడమే ఒక పెద్ద encouragement, motivation. పైన చెప్పినట్లు, వీళ్ల రచనలు భక్తి భావానికే పెద్ద పీట వేశాయి.
మన సినిమా సంగీతం సాహిత్యం మాటకొస్తే, ఈ తెలుగు పాటల రచనలు భక్తి భావం తో పాటు, ఇతర భావాలు, నవరసాలు**, కొంతమేర పండించాయి. అనేక రాగాల లో అనేకరకమైన పాటలను మన సంగీత దర్శకులు స్వరపరచి శభాష్ అనిపించుకున్నారు.
ఎక్కడో చదివాను కర్ణాటక సంగీతంలో వెయ్యి పైనే రాగాలు వున్నాయని. (వీటిలో నాకు తెలిసినవి కొన్ని మాత్రమే). నవరసాలను పండించగల శాస్త్రీయ పరమైన రాగాలు అసలు వున్నాయా ? వుంటే ఎన్ని వున్నాయి ? అవి ఏ ఏ రాగాలు? ఇలాంటి ప్రశ్నలు నాకు ఎప్పటినుంచో నా బుర్రను తొలుస్తూ వుండేవి. మా గురువు గారి సహకారంతో ఈ అంశం మీద కొంత విశ్లేషణ చేసిన పిదప ఈ బ్లాగ్ రాయటం జరిగింది. నా దృష్టిలో అన్ని రాగాలు అన్ని రకాల భావాలను రసాలను పండించటానికి అనువైనవి కావు. అనువైనవి కానక్కరలేదు కూడా.
ఉదాహరణకు, కర్ణాటక సంగీతంలో 'తోడి' రాగం ప్రఖ్యాతమైనది. ఆ రాగం లో ఎన్నో అద్భుతమైన క్లాసికల్ రచనలు వున్నాయి. అవి భక్తి, కరుణ రసాలను వెదజల్లుతాయి. ఆ రాగం లో ఒక హాస్య రచన, లేదా ఒక రౌద్ర రచన ఊహించలేము. ఎందుకంటే, ఆ రాగ లక్షణాలు, ఆ రాగం యొక్క ఆరోహణ, అవరోహణ కొన్ని రకాల కీర్తనలకి, పాటలకి సరిపోవు. ఒకటి రెండు సినిమా పాటలు వున్నాయి ఈ రాగం లో. కానీ అవి typical పాటలు. ఆనందభైరవి సినిమా లో బ్రహ్మంజలీ పాట ఇదే రాగం లో స్వరపరిచారు.
ఒక స్కేలు తో పది రకాల అవసరాలు తీర్చుకోవచ్ఛు. అట్లాగే వంకాయలతో పది రకాల వంటకాలు చేయవచ్చు. ఇదే తరహాలో, ఏదైనా ఒకే రాగం పలు రకాల పాటలు(నవ రసాలలో కొన్నైనా) స్వరపరచగలగటానికి అనువుగా వుంటుందా? వుంటే అట్లా స్వరపరచిన పాటలు ఆదరణ పొందుతాయా? ఈ విషయంపై తెలుసుకోవాలని నాకు ఎప్పుడూ ఆసక్తి వుండేది.
ఆ శోధన లో తేలింది ఏమిటంటే….అటువంటి రాగాలు (నవరసాలని పండించే )ఎక్కువగా లేవని. ఉన్న కొద్ది రాగాలు బాగా పాపులర్ అయ్యాయి. తెలుగు ప్రజల మదిలో ఆ రాగాల పాటలు నాటుకుపోయాయి.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ ఉన్న కొద్దిపాటి రాగాల్లో మోహన రాగం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రాగం లో స్వరపరచబడ్డ వివిధ రకాల తెలుగు పాటలు కొన్ని చూద్దాం.
మొదటగా లవకుశ లో 'లేరు కుశలవుల సాటి'. ఈ పాటలో ధీరత్వం వీరత్వం బాగా కనబడతాయి. అది మోహన రాగ లక్షణమే. ఈ పాట ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలసు. సాహిత్యం లో ఉన్నటువంటి విలువలు, రచయిత చెప్పాలనుకున్న అంశాలు ఈ రాగం బాగా ఆవిష్కరించింది.
అట్లాగే భలే అమ్మాయిలు చిత్రం లో 'గోపాల జాగేలరా' అనే పాట రాగమాలిక. పాట పల్లవి మోహన రాగం లో గంభీరంగా, ధాటిగా, confident గా మొదలవుతుంది. తర్వాత షణ్ముఖప్రియ రాగం లోకి పోతుంది.
మనందరికీ ఎంతో ఇష్టమైన 'లాహిరి లాహిరి లాహిరి లో' పాట కూడా మోహనమే. చాలా సులభంగా, సంగీత జ్ఞానం అవసరం లేకుండా పాడుకునే పాట. 'చెంగు చెంగున గంతులు వేయండి' నమ్మినబంటు చిత్రం లోనిది. ఈ పాట లో కరుణ,(జంతు) ప్రేమ, ప్రోత్సాహం కనబడతాయి. అది మోహన రాగ పుణ్యమే. 'ఘనా ఘన సుందరా', 'ఒక పిలుపు లో పిలిచితే', 'శివ శివ శంకరా', 'తిరుమల మందిర సుందరా', 'కనులకు వెలుతురు నీవే గాదా' ఈ పాటల్లో మనకి భక్తి పారవశ్యం కనబడుతుంది.
Message oriented పాటల్లోకి వెడితే 'ఉందిలే మంచి కాలం ముందు '. ఇది శ్రీశ్రీ గారి రచన, పెండ్యాల గారి సంగీతం. అట్లాగే 'పిల్లలూ దేవుడూ చల్లని వారే', 'పాడవోయి భారతీయుడా' పాటలో 'స్వాతంత్ర్యం వచ్చేనని సభలే' అనే చరణం మోహన రాగం లో దర్శనమిస్తుంది.
' నిన్ను కోరి వర్ణం సరి సరి', 'నెరజాణవులే' ఈ పాటలు కాస్త శృంగార రసాన్ని మోహనంగా కురిపిస్తాయి. చక్కటి సున్నితమైన ప్రేమ డ్యూయట్ పాటల కొస్తే 'మనసు పరిమళించేనే', 'మౌనముగా నీ మనసు పాడిన ',' పాడవేల రాధికా' ఉండనే వున్నాయి.
'చందన చర్చిత నీల'... ఇది మోహన రాగం లో పెద్ద హిట్. మా అక్కయ్య తన పెళ్లి చూపుల్లో ఈ పాట పాడి అందర్నీ సమ్మోహితులను చేసేసింది. So, దీన్ని పెళ్ళి చూపుల పాట అనవచ్చును.
మోహన రాగాన్ని పౌరాణిక నాటకాల్లో విరివిగా వాడుకున్నారు. ఇక్కడ చర్చించిన పాటలే కాక ఇంకా ఎన్నో సినిమా పాటలు మోహన రాగం లో గుబాళిస్తాయి. వీటి గురించి మరో సంచిక లో చర్ఛిద్దాం. ఈ మోహన రాగాన్ని సినిమా పాటలకి వాడుకోవటంలో కొన్ని సార్లు అన్య స్వరాల (like ‘మ’) ప్రయోగం తప్పదేమో.
అన్ని రాగాలు అన్ని రసాలను ఒలికించలేవు, కొన్ని రాగాలకే అది పరిమితం. దాంట్లో మోహన ఒకటి. ఒకే రాగం పలుభావాలని ఎలా పలికించవచ్చనేది ఈ సంచికలో చెప్పటమైనది. ఇటువంటి రాగాలు ఇంకా కొన్ని వున్నాయి. వాటి సంగతి మరో సంచికలో చూద్దాం.
అంతవరకు సెలవు.
స్వస్తి
*
వాగ్గేయకారులు అంటే రచన చేయడం, దానికి స్వరపరచటం, ఆ స్వరపరచిన దానిని చక్కటి శృతి లో పాడగలగటం. ఈ మూడు skills కలిగియున్న వాళ్ళను వాగ్గేయకారులు అంటారు. ఉదాహరణకు సంగీతత్రయం(త్యాగరాజు, దీక్షితార్, శ్యామశాస్త్రి), GNB, అన్నమాచార్యులవారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇంకా మరెందరో..
**
నవరసాలు : శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం.