రచయిత : “అమృతవర్షిణి”
సంపుటి 1 సంచిక 7 ఏప్రిల్ 2023
'ఆ పాట - నా మాట'
ఏదైనా పాటకు సంగీతమా, సాహిత్యమా.. ఏది ముఖ్యం? నా దృష్టిలో ఏ పాటైనా రాణించటానికి, పది కాలాల పాటు గుర్తుండటానికి, ప్రధానంగా మూడు లక్షణాలు వుండాలి. అవి సాహిత్య, సంగీత విలువలు. ఆ సంగీత విలువలు క్లాసికల్ ఆధారం అయితే ఇంక చెప్పేదేముంది. వీటితో పాటు, పాడిన గాయని/గాయకుల గొంతు మాధుర్యం ఎంతగానో దోహదపడుతుంది.
ఈ మూడు(each 100%)కలసిన పాటలు మన తెలుగు చిత్రాలలో కొల్లలు. ఈ మూడూ కలసిన వాటిని మొదటి వెరైటిగా భావిద్దాం. ఈ విభాగంలో ఉదాహరణకు కొన్ని పాటలు:
మది శారదాదేవి మందిరమే... పాడవేల రాధికా
శ్రీ లలితా శివజ్యోతి పగలే వెన్నెల ఎందుకే నీ కింత తొందరా
మనసున మనసై మనసే అందాల బృందావనం
అందెల రవమిది ఏమని పాడెదనో ఈ వేళ
చిగురులు వేసిన కలలన్నీ శివశంకరి శివానంద లహరి
రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య శ్రీ రఘురాం జయ రఘురాం
ఊహలు గుసగుస లాడే కొండ గాలి తిరిగింది
సీతా రాముల కల్యాణము చూతము రారండి నిను చేర మనసాయెరా
...........
........... ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
ఈ పాటలంటే ఇప్పటికీ మా generation వాళ్ళు చెవి కోసుకుంటారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు.
ఇక రెండో వెరైటి.
ఈ పాటల్లో సంగీత (క్లాసికల్) విలువలు తక్కువ. బీట్ ప్రధానంగా సాగుతాయి. మిగతా రెండూ బాగానే వుంటాయి. ఈ విభాగంలోనే మనకు ఎక్కువ శాతం పాటలు వినబడతాయి.
ఉదా:
అయ్యయ్యో చేతుల డబ్బులు పోయెనే సరదా సరదా సిగరెట్టు
పచ్చని చెట్టూ ఒకటి టాటా వీడుకోలు ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి
ఎదగడానికి ఎందుకురా తొందర పచ్చ బొట్టు చెరిగి పోదులే
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా మనసున వున్నది చెప్పాలనున్నది
నా జన్మభూమి ఎంతో అందమైన దేశము వినరా వినరా నరుడా
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది ఖుషీ ఖుషీ గా నవ్వుతూ
జగమే మాయ బ్రతుకే మాయ
.........
......... ఇంకా ఎన్నో మరెన్నో..
ఇక మూడో వెరైటి.
సాధారణంగా వీటిలో సంగీత, సాహిత్య విలువలు తక్కువగా ఉంటాయి. పాడేవాళ్ళ తెలుగు అంతంత మాత్రంగానే (ఈ మధ్య వస్తున్న వాళ్ళ ఉచ్ఛారణ) ఉంటుంది. వాళ్ళ voice quality అదోరకం. పాట సాహిత్యం లో, చిత్రీకరణ లో మాస్ అప్పీలు కనబడుతుంది. కానీ ఏదో తెలియని ఒక విచిత్రమైన రిథమ్ పాటని హిట్ చేస్తుంది.
ఉదా:
బాపు గారి బొమ్మో రింగ రింగ చలి చలిగా
ఇంకేం ఇంకేం కావాలే పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లా
మళ్ళి కూయవే గువ్వా నెల్లూరి నెరజాణ పచ్చని చిలుకలు తోడుంటే
ఆడదాని ఓర చూపులో జగాన చెలియ చెలియ
అందగాడా అందగాడా సెంచరీలు కొట్టే వయస్సు మాది
రాసలీల వేళ రాయబార మేల
ఇట్లా రాస్తూపోతే ముగింపే లేదు.
ఈ శీర్షిక పాట "ముక్కోటి దేవతలు ఒక్కటైనారు". ఇది మొదటి వెరైటి కి సంబంధించినది.
ఇక పాటకి వస్తే, మనందరికీ ఎంతో పరిచయమున్న పాట, మరెంతగానో నచ్చిన పాట ఇది. సంగీత, సాహిత్య విలువలు పుష్కలంగా ఉన్న పాట ఇది. ఘంటసాల గారి హిట్ పాటల్లో ఒకటి.
మనకి ఏదైనా పెద్ద సమస్య వస్తే, పదిమంది దేవుళ్ళని ప్రార్థించటం సర్వసాధారణం. అదే తరహలో ఈ చిత్రం లో హీరో కూడా ఒక పాప తప్పిపోతే పలు దేవుళ్ళని పాట రూపంలో ప్రార్థించటం ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట పూర్తిగా Self explanatory. ఈ పాట రచయిత ఆరుద్ర గారు. ఆయన రచనకి తిరుగు వుండదు కదా !
ఈ పాట ఒక రాగమాలిక. రాగాల హారం. పెండ్యాల గారు ఎన్నిక చేసిన రాగాలు కర్ణాటక సంగీతం లో ఆయనకి వున్న పట్టు, ఉన్నతమైన అభిరుచి తెలియపరుస్థాయి. అందులో, పాడేది ఘంటసాల గారు కాబట్టి పెండ్యాల గారు ధైర్యం చేసి మంచి tough రాగాలు select చేసి, చక్కటి చిక్కటి ట్యూన్ చేసి మనకి ఒక అద్భుతమైన పాట అందించారు. సినిమా లో ఈ పాట హైలైట్ గా నిలిచింది. సంగీత పరంగా ఎవ్వరూ వేలేత్తి చూపలేరు. అసలు పల్లవి ని కాంభోజి రాగం లో స్వరపరచటం ఒక సాహసం.
ఈ పాట చరణం తిరుపతి వెంకన్న తో మొదలై, అక్కడి నుంచి నెల్లూరు రంగనాయకులను దర్శించి, అక్కడి నుంచి బెజవాడ కనకదుర్గమ్మను వేడుకొని, భద్రాచలం రాముల వారికి వినతిపత్రం సమర్పించి, అక్కడ నుంచి సింహాచలం చేరుకొని, సింహాచలేశుని దీవెనలందుకొనటంతో పాట ముగింపు.
ఆరుద్ర గారు ఈ పాట కి అందించిన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాటలో పదాలు అతికినట్టు రాశారు. ఇటువంటి రాగాలకి తగ్గట్టుగా సాహిత్యం రాయాలంటే రచయిత కు సంగీతం లో కాస్తో కూస్తో ప్రవేశం వుండి వుంటుంది.
ఇక్కడ స్వర పరచిన రాగాల్లో కాంభోజి, కీరవాణి రెండూ కష్టమైన రాగాలే. మిగతావి కొద్దిగా తేలికైనవి. చరణం నుంచి పల్లవి కి transition smooth గా వుంటుంది. అయినా ఇటువంటి transitions ఘంటసాల గారికి చెప్పేదేముంది, నేర్పేదేముంది!
స్వస్తి