రచయిత : “అమృతవర్షిణి”
సంపుటి 1 సంచిక 6 మార్చి 2023
భగవంతుణ్ణి మనం ఏమి కోరాలి?
సగటు మనిషి ప్రతి రోజూ దేవుడికి తనకు చేతనైన రీతిలో పూజ చేయటం, ధ్యానం చేయటం అనేవి ఆచరిస్తూ వుంటాడు. సామాన్యంగా, ప్రతి రోజూ పూజలో దేవుణ్ణి ఏమి కోరకపోయినా, అప్పుడప్పుడు ఈ పూజా సమయంలోనో, వ్రతాల సమయంలోనో, లేదా ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు, తన కోర్కెలను భగవంతుడికి నివేదిస్తాడు. ఇట్లా కోరటం తప్పేమీ కాకపోవచ్చు. ఈ కోర్కెలు చాలామటుకు తనకు, తన కుటుంబానికి సంబంధించినవై వుంటాయి. కోరే కోరికలు సామాన్యంగా వారి వారి అవసరాలు, సంస్కారం బట్టి వుంటాయి.
ఉదాహరణకు, ఒకతను ఏదైనా వ్రతం చేసుకుని తనకు ప్రమోషన్ రావాలని, లేదా కూతురికి మంచి సంబంధం దొరకాలని, లేదా త్వరలో ఇల్లు కొనుక్కోవాలని వగైరా వగైరా కోర్కెలు కోరవచ్చు. వీటిల్లో కొన్ని ఒక్కోసారి ఒక్కరికి తీరవచ్చు. తీరక పోవచ్చు. ఇట్లా మనం కోరటం అవి తీరటం కేవలం యాదృచ్చికం కావచ్చు, కాకనూ పోవచ్చు. ఆ కోరిక తీరటం, చేసిన వ్రత మహిమే అని ఖచ్చితంగా చెప్పలేము. దానివల్లే అని అనుకోవటంలో తప్పు లేదు కూడా. చాలా వరకు ఆ కోరిక తీరటం పూర్వ జన్మ పుణ్యం కావచ్చు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు చేసిన వ్రతం వృధా అయిందని అనుకోకూడదు . దాని ఫలం ఈ జన్మలోనే ముందు ముందు లేదా, మరుసటి జన్మల్లో పొందవచ్చు. కర్మ జడ పదార్ధం. చేసిన కర్మకు ఎప్పుడు, ఎంత ఫలం ఇవ్వాలో, యెట్లా ఇవ్వాలో ఆ పరమేశ్వరుడు నిర్ణయించి అమలు పరుస్తాడు. ఆ ఫలాలు చెడు గాని మంచి గాని, మనిషి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయాన్ని అనుసరించి తన జాతక చక్రంలో ఇమిడి వుంటాయి.
శ్రీ భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు జరగవలసిన events అయ్యి తీరుతాయి. వాటిని ఆపలేము. అలాగే రాసిపెట్టనవి ఎంత ప్రయత్నం చేసినా వాటిని చేయలేము. అసలు మనం కోరినా కోరకపోయినా వచ్చేది ఆగదు. రానిది రాదు.
కోరికలు తీరినప్పుడు మరిన్ని కోరికలు కోరటానికి మనస్సు పరుగులు తీస్తుంది. తీరకపోతే మరల మరల ఆ కోరికలు తీరేవరకు కోరటం జరుగుతుంది. ఇట్లా, మనంతట మనమే కోరికల సుడిగుండం లో చిక్కుకునే ప్రమాదం పొంచి వుంది. అవి అనేక జన్మలకి దారి తీస్తుంది. శ్రీ శంకర భగవత్పాదులు భజ గోవిందం లో చెప్పినట్టు, పునరపి జననం పునరపి మరణం అనే స్థితిలోకి మనకి మనమే వెళ్తున్నాము. కర్మలు చెయ్యక తప్పనప్పుడు మంచి కర్మలు చేసుకుంటే మంచిది కదా ! అట్లా కనీసం మంచి జన్మలు లభిస్తాయి ముందు ముందు.
ఈ మొత్తం సృష్టి భగవంతుడు ఒక పక్కా ప్రణాళికా రూపంలో నడిపిస్తున్నాడు అని అనిపిస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వ జన్మల కర్మఫలాల, వాసనల ఫలింతంగా ఈ జన్మ కలిగేటట్లు నిర్ణయించటం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వారి వారి జీవితాలు నడుస్తాయి. ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు వుంటే, వాళ్ళ స్థితిగతులు ఒకే రకంగా ఉండకపోవటం, వాళ్ళలో విభిన్నమైన ఆలోచనలు, నడవడి మనం చూస్తూవుంటాం. వీటికి కారణం వారి వారి పూర్వ జన్మల వాసనలు, కర్మ ఫలాలే కారణం. అట్లాగే ఇద్దరు కొడుకులకి ఇంట్లో చెరో గది కేటాయిస్తే , ఒకడు తన గదిని చక్కగా పెట్టుకుంటాడు . మరొకడు పిచ్చి పిచ్చి గా, చిందర వందరంగా పెట్టుకుంటాడు. ఇట్లా ఎందుకు ఉంటారంటే, చాలావరకు ఇది వాళ్ళ పూర్వ జన్మల వాసనల ఫలితం. ఏ ఇతర జీవికి ఇవ్వని మనస్సు, తెలివి, బుద్ధి, విచక్షణా జ్ఞానం భగవంతుడు మనిషికి ఇచ్చాడు. వీటిని ఇవ్వటంలోని ముఖ్య ఉద్దేశ్యం వాటిని సన్మార్గంలో ఉపయోగించుకొని, ధర్మ భద్దంగా జీవిస్తూ, కృషి చేసుకోమని, జన్మరాహిత్య స్థితి కోసం ఆరాటపడమని.
అసలు ఏమీ కోరకుండా వుంటే బాగుంటుంది. కానీ కోరకుండా ఉండలేం. ఎందుకంటె మనం సగటు మనుషులం. పూర్తిగా మాయలో, భ్రమలో బతుకుతున్న వాళ్ళం. కాబట్టి మనం కోరేవి కొంతలో కొంత సమంజసం గా వుంటే బాగుంటుంది. ఈ మనుష్య జీవిత పరమార్థం మోక్ష సాధనే అనేది ఎన్నటికీ మరువకూడదు. ఆ దిశ లో మన సాధన ఎల్లప్పుడూ జరుగుతూ వుండాలి . అందువల్ల మనం కోరే కోరికలు భౌతిక మైనవి, లౌకిక మైనవి కాకుండా, మోక్ష సాధన దిశలో వుంటే బాగుంటుంది.
కాబట్టి మనం ఏం కోరుకుంటే బాగుంటుంది? ఈక్రింది విధంగా కోరుకుంటే బాగుంటుందేమో కదా!
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
స్థూలంగా వీటి అర్ధాలు ఈ విధంగా వున్నాయి. అసత్యంలోంచి సత్యం వైపు , చీకటిలోంచి వెలుగులోకి , మృత్యువునుంచి మోక్షం మార్గం వైపు నన్ను నడిపించు.
ఇంకాస్త విపులంగా చెప్పాలంటే, అసత్యం లోంచి సత్యం వైపు నడిపించు . అంటే కనబడుతున్న ఈ అసత్య, మిధ్యా ప్రపంచం నుంచి సత్య మార్గం లోకి, అజ్ఞాన మార్గం నుంచి ఙ్ఞాన మార్గంలోకి నడిపించు. నా మనస్సుని కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు పట్టి పీడిస్తున్నాయి. దాంతో ఎప్పుడూ అశాంత స్థితి లో ఉంటున్నాను. వాటి బారి నుంచి నన్ను, నా మనస్సు ని కాపాడు. అప్పుడు నేను నిన్ను గుర్తించ గలుగుతాను. ఈ జనన మరణాల చట్రం నుంచి నన్ను బయటపడేయి. అంటే నన్ను నీలో కలుపుకో.
ఈ మూడోది మృత్యువు నుంచి విముక్తి పొంది మోక్షం కావాలంటే, మొదటగా మొదటి రెండూ సాధించాలి. అప్పుడు మూడోదానికి ఆటోమాటిక్ గా దగ్గరవుతాం.
ఎవరైనా ఈ పై మూడు గురించి విపులంగా తెలిసినా , తెలియకపోయినా, ఈ అర్ధం వచ్ఛేట్లు మనస్సు లో తలచుకొని పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేసినా భగవంతుడు మన తాపత్రయాన్ని గుర్తిస్తాడు. ఇట్లా మనం ప్రతి రోజూ చెయ్యవలసి ఉంటుంది .
కాబట్టి, వీటిని మనం కాస్తంత అర్ధంచేసుకొని, ప్రతిరోజూ మన పూజ తరువాత, లేదా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే భగవంతుణ్ణి ఈ విధంగా కోరుకుంటే బాగుంటుందేమో కదా!!!