రచయిత : “అమృతవర్షిణి”
సంపుటి 1 సంచిక 5 ఫిబ్రవరి 2023
ఈ సంచికలో సంగీతంలో ‘రాగమాలిక’ అనే ప్రత్యేక అంశాన్ని కొద్దిగా పరిశీలిద్దాం. సామాన్యంగా ఒక కృతిలో గానీ, సంకీర్తనలో గానీ పల్లవి, చరణాలు ఒకే రాగంలో కూర్చబడివుంటాయి. కానీ పల్లవి, చరణాలు వేర్వేరు రాగాలలో ట్యూన్ చేయబడివుంటే, అటువంటి కీర్తనని రాగమాలిక అంటారు. అంటే ఏదైనా పాట రాగమాలిక అనబడాలంటే కనీసం రెండు రాగాలు వుండాలి. గరిష్టంగా ఎన్నయినా వుండవచ్చు. బంతి పూలు పసుపు పచ్చగా వుంటాయి. వాటితో కట్టిన పూల దండ చాలా బాగుంటుంది. నాలుగైదు రంగుల్లో వున్న బంతి పూలతో కట్టిన దండ ఎంతో బాగుటుంది. అదే తరహాలో రాగమాలిక .
ఉదాహరణకు MS గారు పాడిన అన్నమాచార్య సంకీర్తన “ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన” (బృందావని & మాయామాళవగౌళ ), “మైత్రీమ్ భజాతా” (యమన్ కల్యాణి & కాపి ) రెండేసి రాగాల్లో ట్యూన్ చేయబడ్డాయి. అదేవిధంగా ఆవిడ పాడిన “భజ గోవిందం”, ‘భావయమి రఘురామం” పల్లవి, చరణాలు వివిధ రాగాల్లో వుంటాయి. అందుకని అవి రాగమాలికలుగా పేరుబడ్డాయి. ప్రఖ్యాత “నవ రాగ మాలిక వర్ణం” కూడా ఒక రాగమాలికే. శాస్త్రీయ సంగీతంలో చాలామంది చాలా రాగమాలికలు చేశారు. మన డా. బాలమురళి కృష్ణ గారు ఈ విషయంలో తక్కువేమీ కాదండోయ్.
అసలు రాగమాలిక అనేది ఒక వినూత్న ప్రయోగం. ఒక రచన (పాట)లో చరణాలు వేర్వేరు భావాల్ని ప్రకటించటానికి ఆ చరణాలు వేర్వేరు రాగాల్లో ట్యూన్ చేస్తే ఎలా వుంటుంది అనే ఆలోచన ఈ రాగమాలిక సృష్టికి మూలం అయివుండవచ్చు.
ఈ concept ని మన సంగీత దర్శకులు విరివిగా వాడుకుని తెలుగు చలన చిత్రాల్లో అనేక రాగమాలికలు కల్పన చేశారు.
దేవదాసు చిత్రంలోని ‘ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా’ పాట సుబ్బరామన్ గారి ఒక అపూర్వ రాగమాలిక. దీంట్లో పల్లవి, మొదటి చరణం ఖరహరప్రియ రాగంలో, రెండవ చరణం రంజని రాగంలో, మూడవ చరణం మోహన రాగంలో ట్యూన్ చేయబడ్డాయి.
రహస్యం చిత్రంలో ‘గిరిజా కల్యాణం’ ఒక చక్కటి రాగమాలిక . అనేక రాగాల సమ్మేళనం.
‘ముక్కోటి దేవతలు ఒక్కటైనారు’ అనే తెలుగు సినిమా పాత పాట ఒక అద్భుతమైన రాగమాలిక. అలాగే ‘హే కృష్ణా ముకుందా మురారీ’ కూడా ఒక చక్కటి రాగమాలికే. ‘స్వరములు ఏడైనా రాగాలెన్నో’ , ‘వెళ్ళిరా మా తల్లి చల్లగాను’ మరికొన్ని ఉదాహరణలు. ఈ రెండో పాట లో శహన, పున్నాగ వరాళి, కేదారగౌళ, ఆనందభైరవి వినబడతాయి. ఈ లింకులో వినండి ఒకసారి.
https://www.youtube.com/watch?v=a_GEuzgpypU
భలే అమ్మాయిలు చిత్రంలోని ‘గోపాల జాగేలరా’ .. దీంట్లో మోహన తో మొదలైయ్యి RTP మాదిరి షణ్ముఖప్రియ, కాంభోజి, మధ్యమావతి రాగాల్లో కల్పనా స్వరాలు వేస్తారు. ఎస్. రాజేశ్వరరావు గారికి సంగీతంలో వున్న కమాండ్ కి ఈ పాట ఒక ఉదాహరణ .
https://www.youtube.com/watch?v=MMLiY8ZAWFk
MLV గారు పాడిన ఈ రాగమాలిక (14 రాగాలు) వినండి.
https://www.youtube.com/watch?v=1-1dgKw3Ijs
ఏది ఏమైనప్పటికి యే రాగమాలికైనా వినడానికి బాగుంటుంది. పాడగలిగితే మరీను.