రచయిత : “అమృతవర్షిణి”
సంపుటి 1 సంచిక 4 జనవరి 2023
శ్రీ త్యాగరాజస్వామి కృతులను విశ్లేషించటం అంత తేలికైన విషయం కాదు. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా అది అసంపూర్ణమే. ఇంకా ఏదో మిగులు వుంటుంది. ఎందుకంటే, మనకి ఆ రచన వెనుక వున్న త్యాగరాజ స్వామి హృదయం తెలియదు కనుక. వారి కృతులన్నీ ఆణిముత్యాలే. కొన్ని మరీ. ఆ కోవలో చెందింది ఆందోళిక అనే రాగంలో చేసిన ‘రాగ సుధా రస ‘ అనే రచన. దీన్ని ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే రాగం, పాట.
పల్లవి :
రాగ సుధా రస పానము చేసి రాజిల్లవే ఓ మనసా!
అనుపల్లవి :
యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే
చరణం :
సదా శివ మయ మగు - నాదోంకార స్వర
విదులు జీవన్ ముక్తులని త్యాగరాజు తెలియు
మొదటగా నా చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అప్పట్లో ఈ పాట ఎవరి రచనో తెలియలేదు. పాటలో త్యాగరాజు అని ముద్ర వున్నా, రచయిత పేరు కనుక్కోలేకపోయాను. అప్పుడు ఎవరినీ అడిగినట్టుగా కూడ గుర్తు లేదు. ఆ తరవాత కొన్నాళ్ళకి
ఒక రేడియో సంగీత కచేరిలో ఈ పాటని ఒక గాయని పాడటం, అది నే వినటం జరిగింది.
అప్పుడు తెలిసింది ఇది సద్గురు త్యాగరాజస్వామి కృతి యని, ఆందోళిక అనే రాగం లో కూర్చబడిందని.
ఈ కృతిలో రాగ భావం, సాహిత్య భావం పుష్కలంగా వున్నాయి. అంతేకాక, ఈ రాగం చాలా మధురమైనది. దాని ఆరోహణ, అవరోహణ లోనే ఒక వింత వుంటుంది.
దాని వల్ల ఈ రాగానికి ఒక ప్రత్యేక శోభ వచ్చింది. ఈ రచనలోని విషయాన్ని కొద్దిగా పరిశీలిద్దాం. త్యాగరాజస్వామి ఈ కృతిలో 'మనసుని' సంబోధిస్తున్నారు . ఏమనంటే, "ఓ మనసా! హాయిగా రాగ సుధ లోని అమృత రసాన్ని గ్రోలి చక్కటి అనుభూతిని, ఉన్నతమైన మానసిక స్థితిని పొందు.
దానితోపాటు, దానివల్ల కలిగే నాలుగు రకాల ఫలములు అనగా, యాగ ఫలం, యోగ ఫలం, త్యాగ ఫలం, భోగ ఫలం ఆస్వాదించు. పరమశివుడి నుండి ఉద్భవించిన నాదం ఓంకార రూపంగా మొదలై ఏడు స్వరాలైనది.
ఈ విషయాన్ని గ్రహించిన విద్వాంసులు జీవన్ముక్తులు అని నేను తెలుసుకున్నాను" అంటున్నారు త్యాగరాజు .
త్యాగరాజస్వామి తన స్వానుభవంతో తెలుసుకొన్న విషయాన్ని చెప్పటానికి చక్కటి రాగాన్ని ఎన్నుకొన్నారు . ఈ రాగంలో వున్న అతి కొద్ది క్లాసికల్ కృతులలో బహుళ ప్రాచుర్యం పొందిన కృతి ఇది . ఈ పాటలో తార స్థాయి కి వెళ్ళినప్పుడు ఈ రాగం యొక్క అందం ద్విగుణీకృత మౌతుంది . అసలు ఈ పాటవిని రంజించని మనసు ఉండదేమో !
ఈ కృతి గురించి చెప్పాలంటే ఎంతైనా వుంది. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ కృతిని మిస్సమ్మ (పాత) చిత్రంలో కృతిని యథా తథంగా వాడుకున్న తీరు ప్రశంశనీయం. తేడా ఏమిటంటే, సినిమాలో దీన్ని సెమి క్లాస్సికల్ టైపులో (కొద్దిగా ఫాస్ట్ గా) పాడేసారు. ఫాస్ట్ గా పాడినా ఈ పాట మాధుర్యం కోల్పోలేదు.
ఈ సినిమా లోని బహుళ ప్రాచుర్యం చెందిన పాటల్లోఇది ఒకటి, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ.
మనమందరం ఈ సినిమాన్ని చాల సార్లు చూసి వుంటాం. మహానటి సావిత్రి సంగీత పాఠాలు ఒక విద్యార్ధినికి నేర్పుతూ,
తాళం వేస్తూ ఈ పాట పాడుతుంది. సంగీతం యొక్క విశిష్ఠతని, సినిమాలో ఈ పాట ద్వారా నేర్పడం, తెలియచెప్పడం చాలా బాగుంది. ఈ చిత్ర దర్శక, నిర్మాత, సంగీత దర్శకులు సినిమా లో ఈ సందర్భం కోసం ఈ కృతినే ఎన్నుకోవడం ఎంతైనా ముదావహం. వాళ్ళ అభిరుచికి ఇది ఒక తార్కాణం.
ఏ ఇతర రాగం మీద ఆధారపడిన ఏ ఇతర పాటని దీని బదులు ఇక్కడ వాడివుంటే అంత రక్తి కట్టేది కాదేమో! అయినా చెప్పలేం లెండి ! ఎందుకంటే రాజేశ్వరరావు గారు
సంగీతంలో ఆరితేరిన ఉద్దండులు కదా!
ఒకసారి మా బంధువుల అబ్బాయి పెళ్లి చూపులకి వెళితే, అక్కడ ఆ అమ్మాయి ఈ పాట పాడి అందరి ప్రశంసలు కొట్టేసింది. అబ్బాయి వైపు వాళ్ళకి కట్నం ఆశ కొద్దిగా వుండేది. అమ్మాయి వాళ్ళది ఇచ్చుకోలేని స్థితి. అమ్మాయికి అందంతోపాటు , చదువు, సంగీతంలో ప్రవేశం వున్నాయి. ఇంకేం కావాలి. అంతే అబ్బాయి ఫిదా అయిపోయాడు. ఇంట్లోవాళ్ళని ఒప్పించి కట్నం లేకుండా, అటువైపు పెళ్లి ఖర్చులు చాలా వరకు తనే సర్ది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందరూ వాళ్ళ సంస్కారాన్ని మెచ్చుకొన్నారు.
ఆందోళిక అంటే ఉయ్యాల. ఎవరైనా దీన్ని బాగా పాడగా వింటే ఉయ్యాలలో ఊగిన అనుభూతికలుగుతుంది. గాయని లీల గారికి సంగీత పరిజ్ఞానం ఉండటంవల్ల అతి సులువుగా, మధురంగా దీన్ని పాడేసారు . అందుకనే, మీ సౌలభ్యం కొరకు ఈ సినిమా పాటని మరియు ఒక classical version ని ఇక్కడ పొందుపరచటం జరిగింది.
విని మరొక్కసారి ఆనందించండి, ఉయ్యాల లూగండి!
https://www.youtube.com/watch?v=DwVoMgPmXQ4
https://www.youtube.com/watch?v=IE2hBvBRzFo