అమృతవాహిని

రచయిత : “అమృతవర్షిణి”

సంపుటి 1 సంచిక 3​        డిసెంబర్ 2022
 
దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తెలుగు ప్రజలకి, మంగళ హారతి కి అవినావభావ సంబంధం వుంది. ఏదైనా ఒక శుభ కార్యక్రమం మన ఇళ్ళల్లో, గుళ్ళల్లో జరిగినప్పుడు, కార్యక్రమం చివర్లో మంగళహారతి పాట పాడటం ఒక పెద్ద ఆనవాయితీ.  ఇక్కడ ఎట్లా పాడారు అన్నది ప్రధానం కాదు.  పాడారా, లేదా అన్నదే ముఖ్యం. ఈ పాటలు అన్ని దేవుళ్ళ మీద వున్నాయి.  ప్రధానంగా అమ్మవారి మీద, లక్ష్మి దేవి మీద, వేంకటేశ్వర స్వామి మీద, నారాయణుని మీద , శ్రీ రాముడి  మీద ప్రాముఖ్యం పొందాయి.  అస్సలు కార్యక్రమం చివర్లో ఎందుకు మంగళహారతి పాట పాడాలో ఇంకెప్పుడైనా చూద్దాం .

ఈ మంగళ హారతి పాటలు ఏ రాగంలోనైనా వుండవచ్చు. కానీ, కొన్నిమంగళకరమైన రాగాలు మంగళహరతి పాటలకి పెట్టింది పేరు. ఉదాహరణకు మధ్యమావతి, సురటి, నాదనామక్రియ, సౌరాష్ట, కేదారగౌళ........ కొన్ని తెలుగు చిత్రాల్లో (ముఖ్యంగా పాతవి) కూడా మంగళహరతి పాటలు ప్రాముఖ్యం సంపాదించుకున్నాయి. వాటిల్లో ఒక చక్కటి మంగళహరతి పాట విశ్లేషణ కొంతమేర చూద్దాం.
 
చిత్రం : రహస్యం          ​​గానం : లీల    ​​     రచన : మల్లాది ​
సంగీతం : ఘంటసాల      ​​​​​   రాగం : సురటి
 

శ్రీ లలితా శివ జ్యోతీ సర్వ కామదా 
శ్రీ గిరినిలయా గిరామయా సర్వ మంగళా

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై, స్మరణే జీవనమై 
మాయని వర మీయవే పరమేశ్వరి మంగళ నాయకి

అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతి
రవ్వల తళుకుల కళలా జ్యోతికి  కప్పుర హారతి 
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి

ఈ పాట వ్యవహారానికి వస్తే, ఘంటసాల మాస్టారు దీన్ని' సురటి' రాగంలో ట్యూన్ చేసారు. ఈ రాగం భక్తి భావం ప్రకటించటానికి పెట్టింది పేరు. నాకు తెలిసి ఏ ఇతర సంగీత దర్శకులు తెలుగు చిత్రాలలో ఈ రాగంలో ట్యూన్ చేసిన పాటలు వినబడవు. ఈ రాగం కాస్త కష్టమైనది ట్యూన్ చేయడానికి. అయినప్పటికీ ఘంటసాల గారు కాస్త ధైర్యం తెచ్చుకుని ( ప్రజలకు నచ్చుతుందో లేదో అనే భయంతో) ట్యూన్ చేసి, మనకు ఒక అద్భుతమైన పాటని అందించారు. ఆపాట రికార్డింగ్ అయిన రోజున, ఆ తర్వాత, ఘంటసాల గారిని యూనిట్లో వాళ్ళందరూ తెగ మెచ్చుకున్నారుట. ఘంటసాల గారి contemporary మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారు ఆయనకి ఫోన్ చేసి పాటని ఆ రాగంలో ట్యూన్ చేసి మెప్పించినందుకు అభినందనలు తెలిపారట. ఆ సినిమా బాగా ఆడక పోయినా, ఆ చిత్రంలోని పాటలు మాత్రం ఆణిముత్యాలు, మేలి ముత్యాలు. వాటిల్లో ఇది ఒకటి. నిజం చెప్పాలంటే, నేను ఈ పాటని కొన్ని functions లో(పాడేవారు ఎవ్వరూ లేక) పాడటం జరిగింది. అది నా అదృష్టం గా భావిస్తాను.

ఈ పాట జగన్మాత ని ఉద్దేశిస్తూ పాడిన పాట. అమ్మవారుకి ఉన్న అనేక పేర్లలో లలిత ఒకటి.  శ్రీ లలితా అని అంటూ ఒక శుభప్రదమైన నామంతో మొదలైన పాట.  శివం అంటే మంగళం, శుభం. శివుడికి జ్యోతి లాంటిది కాబట్టి శివజ్యోతి.  జ్యోతి(దీపం) శివానికి అంటే మంగాళానికి, శుభానికి ప్రతీక, కాబట్టి శివజ్యోతి. శ్రీగిరి అంటే కైలాసం.  కైలాస నివాసినీ నీకు సర్వ మంగళం . 

ఈ పాటలో రెండు భాగాలు ఉన్నాయి.  ఒక భాగం స్తుతి పర్వం అంటే అమ్మవారిని స్తుతి చేసేది, పొగిడేది. రెండోది కోర్కెల పర్వం అంటే ఆవిడని కోర్కెలు కోరడం. ఇక్కడ ఈ రెండవది చాల ముఖ్యం. ఇది మొదటి చరణం లో దర్శనమిస్తుంది. జగాలన్నీ(సమస్త లోకాలు) ఆవిడ అధీనంలో ఉన్నాయి.  She is the CEO. చిరునవ్వుతో ఈ జగాలన్నిటిని పరిపాలిస్తుంది.  చల్లని  ప్రేమతో, కనికరముతో, సహనముతో  ఎప్పుడూ మమ్ములను, ఈ సృష్టి ని కాపాడుతుంది. ఎల్లప్పుడూ మా మనస్సు నీ మీదే, నీ వశమై ఉండేట్టు, నీ స్మరణే సదా మా ఊపిరి అయ్యేట్టు, ఎప్పటికీ చెదిరిపోని వరమివ్వు అని పరమశివుడికి నాయకి  అయిన పరమేశ్వరిని కోరటం. ఇది చాలా ఉత్తమోత్తమైన కోరిక. ఆ జగన్మాత అభయ హస్తం, అనుగ్రహం వుంటే అన్నీ ఉన్నట్లే.

పాటలో రెండో చరణం కొద్దిగా ఫాస్ట్ గా సాగుతుంది. ఇక్కడ ఘంటసాల గారు కొద్దిగా ప్రయోగం చేసారు. చరణానికి చరణానికి గతి లో తేడా చూపించడం. ఈ ప్రయోగం చేసి అందరినీ మెప్పించారు. లోకంలో అందం అంటే అమ్మవారిదే. ఎవరైనా ఆవిడ తర్వాతే.  అందం ఆవిడ సొంతం.  ఆవిడ అందం ఎప్పటికీ తరగనిది, వన్నె తగ్గనిది.  అటువంటి మహా తల్లికి సూర్య హారతి. లోకాల్లోని అన్ని అందాలకు ఆవిడే ప్రతినిధి. చంద్ర కాంతి చల్లగా వుంటుంది.  అటువంటి చల్లని తల్లికి చంద్ర హారతి. అమ్మవారు అన్ని కళలకి పుట్టినిల్లు.  ఏ కళా ఆవిడ అనుగ్రహం లేనిదే రాదంటారు.  రవ్వల(డైమండ్ ) తళుకులు లాంటివి ఆ కళలు. అటువంటి కళలకి మారుపేరైన ఆ జగన్మాతకి, ఆ కళల జ్యోతికి కర్పూర హారతి(ఇదే మనం ఏదైనా పూజ చివర్లో ఇచ్చే హారతి). మల్లాది వారు ఈ మూడు హారతులు ఒక అలంకారంగా, వైవిధ్యంగా వాడారు.  

నిగమ అంటే వేదం అని ఒక అర్థం. అన్ని వేదాలు అమ్మవారి చరణాల్ని (పాదాలు)స్థుతిస్తున్నాయి. ఆ పాదాలు పట్టుకుంటే ఇక జన్మ రాహిత్యమే.  కాబట్టి ఆ చరణాలకి మంగళ హారతి.  మొదట్లో కోరిన కోరికకి ఫలం ఇదన్న మాట. మల్లాది వారి సాహిత్యం, లీల గొంతు ఈ రాగానికి బాగా సరిపోయాయి. అందుకని ఈ  మంగళహారతి పాట పెద్ద హిట్ .

ఈ రాగంలో కొన్ని శాస్త్రీయమైన రచనలు : శ్రీ త్యాగరాజస్వామి వారి ‘గీతార్థము సంగీతార్థము ‘, ‘రామచంద్ర నీ దయ’, ‘దీక్షితార్ గారి ‘శ్రీ వేంకటగిరీశ’,  ‘నవగ్రహ కీర్తన(అంగారకుని మీద)’, ఇంకా మరికొన్ని..

‘శ్రీ లలితా శివజ్యోతి’పాట లింకు : https://www.youtube.com/watch?v=4pb1KBo6vRo