రచయిత : “అమృతవర్షిణి”
సంపుటి 1 సంచిక 2 నవంబర్ 2022
ఈ శుభకృతు నామ సంవత్సరంలో చూస్తూ చూస్తూ ఉండగానే అప్పుడే ఏడు తెలుగు మాసాలు అయిపోయి ఎనిమిదో మాసం కార్తీక మాసంలోకి అడుగు పెట్టాం. ఈ మాసంలో ప్రధానంగా కార్తీక సోమవారాలు, పౌర్ణమి,ఏకాదశి తిథులు ముఖ్యమైన పర్వదినాలు.
మనకి శ్రావణమాసం నుంచి వరుసగా పండుగలు వస్తుంటాయి. శ్రావణమాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణపౌర్ణమి, భాద్రపద మాసంలో గణపతి పూజలు, ఆశ్వయుజ మాసం లో దసరా పండుగలు ఆ తర్వాత వచ్చే కార్తీకమాసంలో శివుడి అభిషేకాలు, కార్తీక పౌర్ణమి, అటు పిమ్మట డిసెంబర్లో ధనుర్మాసం వస్తుంది. ఇట్లా మనకి శ్రావణమాసం మొదలుకొని వరుసుగా పండుగలు వస్తూ ఉంటాయి.
ముందు చెప్పినట్టు ఈ కార్తీకమాసంలో కైలాసవాసి పరమేశ్వరుని తలుచుకోవడం అభిషేకాలు చేయటం సర్వసాధారణం. అందులో భాగంగా ఆ గౌరీనాథుని మరోమారు తలుచుకుంటూ ఒక చిన్నరచన సింధుభైరవి రాగంలో (శ్రీ మన్నెంకొండ రామదాసు రచన)పరిచయం చేసుకుందాం.
ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు
పల్లవి :
ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు
అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
చరణం :
శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నన్ను బ్రోచునో
సకల బాధలనుపెట్టి సంకటపడ జూచునో (పరమేశ్వరాజ్ఞ)
వెఱవకుమని అభయమిచ్చి వేగమె రక్షించునో
ఈ అధముడు దుష్టుడనుచు విడువక శిక్షించునో (పర)
ఎందు కొరత లేని బ్రహ్మానంద మోసగి గాచునో
ఎప్పటికీలాగుననే హింసపరచి వేచునో (పర)
ధారుణిలో నన్ను భగవదాస కోటి చేర్చునో
దార పుత్రాదుల వల తగులు కొనక జూచునో (పర)
కూరిమితో సుదర్శనము గొప్పున దయచేయునో
పొరమాలిన మానవులను కొనియాడగ చేయునో (పర)
భయపడవద్దని, భయపడవలసిన అవసరం లేదని అభయం ఇచ్చి ఎల్లప్పుడూ కాపాడుతాడా లేక నన్నుఅథముడు, దుష్టుడని శిక్షిస్తాడా! అనేది మనకు తెలియని పరమేశ్వరుని ఆజ్ఞ. ఎప్పటికీ కొరత లేని బ్రహ్మానందాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడా లేక ఎప్పటి మాదిరే కష్టాలు పడుతూ వుండమంటాడా!ఈ భూమిలో నన్ను భగవంతుడి అనుగ్రహం పొందిన వాళ్లలో చేరుస్తాడా లేక సంసార చక్రంలో పడవేసి బాధలు పడమంటాడా! సంతోషంతో పరమేశ్వరుడు తన దర్శనం ప్రసాదిస్తాడా లేక అజ్ఞానులైన వారిని పొగడ్తూ తిట్టుకుంటూ బతకమంటాడా! అనేది పరమేశ్వరుని ఆజ్ఞ(నిర్ణయం) ప్రకారం నడుస్తుంది. ఆ ఆజ్ఞ ఏమిటనేది పరమేశ్వరుడికి తప్ప ఎవరికి ఎరుక?
Dr. బాలమురళీకృష్ణ గారి గొంతులో ఈ పాట ఈ లింకు ద్వారా వినవచ్చు.
https://www.youtube.com/watch?v=rXMvYnbLHkY
ఇది భక్తిరంజనిలో అప్పుడప్పుడు సోమవారం నాడు వస్తూ ఉంటుంది. మరుగున పడ్డ చక్కటి సాహిత్యం గల రచనలలో(తత్త్వాలు) ఇది ఒకటి అని చెప్పవచ్చు. దీంట్లో పరమేశ్వరుని సంకల్పం, నిర్ణయం, అనుగ్రహం ఎట్లా ఉంటుందో చెప్పనలవి కాదని సారాంశం. అదే ఒక భక్తుని ఆవేదన.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత మన తెలుగు వాళ్లకి చిర పరిచయం. అదే పంథాలో ఓడలు బండ్లు చేస్తాడా, బండ్లు ఓడలు చేస్తాడా అనేదీ ఆయన సంకల్పమే. దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనకు తెలిసిన పురందరదాసు యొక్క జీవిత చరిత్ర. పురందరదాసు స్వతహాగా పరమ లోభి. దీనివల్ల మహాసాధ్వి అయిన ఆయన ధర్మపత్ని ఎన్నో కష్టాలు పడుతుండేది. పాండురంగ విఠలుడికి ఈయనలో పరివర్తన తీసుకురావాలని సంకల్పం కలిగింది. భగవంతుడు అనుకుంటే కానిదేముంది!. అతికొద్ది కాలంలోనే పురందరదాసు యొక్క జీవిత గమ్యాన్ని మార్చేసి ఆయన చేత ఎన్నో అద్భుతమైన రచనలు చేయించి తనలో ఐక్యంచేసుకున్నాడు. అప్పటికీ, ఇప్పటికీ పురందరదాసు కర్ణాటక సంగీతంలో ఒక ఆణిముత్యం గా నిలిచిపోయారు.
ఇదే రాగంలో ఆయన రచన బహుళ ప్రచారం పొందిన ‘వేంకటాచల నిలయం’ అందరికీ తెలిసిందే. అట్లాగే నారాయణ తీర్థ తరంగాలు (కల్యాణ గోపాలం, దేవ దేవం ..)కూడా కొన్ని ఈ రాగంలో ఉన్నాయి. ప్రయాగ రంగదాసు రచన ‘రామ రామ యనరాదా రఘుపతి’మనం విన్నదే. కొన్ని రాగమాలికలలో (MS గానం చేసిన భజగోవిందం లో చివరి చరణం) కూడా ఈ రాగం వినబడుతుంది.
ఈ రాగాన్ని మన తెలుగు సినిమా సంగీత దర్శకులు విరివిగా వాడుకున్నారు. ఉదాహరణకి, పాత పాటలలోకి వెడితే ‘ఏమని పాడెదనో ఈ వేళ, జయ పాండురంగ ప్రభో విఠలా, చేసేది ఏమిటో చేసేయి సూటిగా, మౌనంగానే ఎదగమని, జయంబు నిశ్చయంబురా, చాలదా ఈ పూజ దేవీ, ముద్ద బంతి పూవులో, సింహాచలము మహా పుణ్యక్షేత్రము, ప్రేమకోసమై వలలో పడేనే పాపం పసివాడు, నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరవొద్దు,’ ఇంకా ఎన్నో పాటలు మనకి సుపరిచితమే.
మూర్చన లో వున్న స్వరాలే కాక, కొన్ని అన్యస్వరాలు ఈ రాగం ప్రయోగంలో వాడబడుతుంటాయి. 1988 లో వచ్చిన జాతీయ ఐక్యతా గీతం ‘మిలే సుర్ మేర తుమ్హారా’ కూడా ఇదే రాగంలో ట్యూన్ చేశారు. ఏ format (క్లాసికల్, సెమీ క్లాసికల్, లలిత....) సంగీతమైనా ఎంతగానో రాణించిన రాగం సింధుభైరవి అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు!