శ్రీమతి యామిని కలము నుండి...

Smt. Yamini Subbalaxmi Sripada

స్మరణ                                       Nov 2022

 

భగవంతుని సాయుజ్యము , సన్నిధి చేరుకోవటానికి సులభమైన మార్గము "నామ స్మరణ". దైవాన్ని ప్రయత్న పూర్వకముగా చేరుకోవటానికి స్మరణ నవవిధ భక్తి మార్గాలలో ఒకటి. నిత్యం భగవన్నామస్మరణ ముక్తికి మార్గము.

స్మరణ రెండు విధాలు -

నామ ఉచ్ఛారణ - నోటితో పలకడం , జపించడం

మానసిక స్మరణ - నిరంతరమూ మనసులో ధ్యానం చేయటం  

భజన సంప్రదాయం భగవన్నామస్మరణలో మరో విధానం.

 

శ్రీ రామదాసు గారు దాశరధి శతకంలో ఈ క్రింది విధముగా ప్రార్ధించారు -

"హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్రరాజమై

కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై

పరగినయట్టి నీపతితపావన నామము జిహ్వపై నిరంతరము

నటింపజేయుమిక దాశరధీ కరుణాపయోనిధీ "

నీ నామము ఈశ్వరునకు , విభీషణునకు , పార్వతీదేవికి , కరికి , అహల్యకు , ద్రౌపదికి, శ్రేష్ఠమైన మహామంత్రమైనది . అట్టి పరమ పవిత్రనామము నా నాలుకపై ఎల్లప్పుడూ ఆడునట్లు చేయుము అని తాత్పర్యము.

సంగీత ప్రపంచములో ఎందరో వాగ్గేయకారులు "నామ స్మరణ/నామ సంకీర్తన" విశిష్టతను తమ అనన్యమైన రచనల ద్వారా తెలియచేసారు.

"స్మర వారం వారం చేత: స్మర నందకుమారం "

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యోగి , భగవంతుని దివ్య నామాన్ని విడువక స్తుతించమని బోధించారు.

"స్మరణే ఒందే సాలదే" - మలయమారుతం - ఆదితాళం లో సమకూర్చబడినది . శ్రీ పురందరదాసు భగవంతుని నామ సమరణ ఒక్కటే చాలు అని పరమభక్తి భావనతో ప్రభోదించారు .

"నారాయణ నిన్ననామాద స్మరణేన " - శుద్ధధన్యాసి , నీ వేయినామాలు నా నాలుకపై ఎల్లప్పుడూ ఉండి, నన్ను పాపవిముక్తుడిని చేయమని ప్రార్ధించారు.

శ్రీ రామదాసు గారు సావేరి రాగంలో సమకూర్చబడిన "శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికో మనసా " కీర్తనలో రామనామ స్మరణే చాలు , తారకనామ జపమే చాలు అని తెలియచేసారు.

"కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి - పలుకే బంగారమాయెనా " అని నిదురలో కూడా నీ నామస్మరణ విడువను అని శ్రీ రామదాసు గారు ప్రార్ధించారు.

"అరుణాచలనాధం స్మరామి అనిశం అపీతకుచాంబా సమేతం " శ్రీ ముత్తుస్వామి దీక్షితులు గారు సారంగ రాగంలో రూపక తాళంలో రచించారు. ఆ పరమశివుడు తేజోమయ అగ్నిలింగముగా అమ్మవారు అపీతకుచాంబా సమేతముగా అరుణాచల క్షేత్రములో కొలువైయున్నారు , ఆ ఈశ్వరుని స్మరణ కైవల్య ప్రదమని తెలియచెప్పారు.

" స్మరణే సుఖము " - జనరంజని - ఆదితాళం శ్రీ త్యాగరాజ స్వామి వారు ఈ కృతిలో , మానవుడై జన్మించినందుకు ఉత్తమమైన రాజయోగము పొందుటకు రామనామ స్మరణ వలన , ఆ రాముని రూపము మనసంతానిండి నిజమైన ఆనందమును, మోక్షాన్ని కలిగిస్తుందని తెలియచేసారు .

మైసూరు వాసుదేవాచార్యులు గారు "స్మర భూమిసుతాధిపతిం సతతం " మేఘరంజని రాగం ఆది తాళం మరియు "స్మర రామచంద్రం స్మర సుందరం " - శంకరాభరణం , ఆది తాళం లో రచించి భగవంతుని నామస్మరణ విశిష్ఠతను తెలియచేసారు.

స్వాతి తిరునాళ్ మహారాజ నవవిధ భక్తి కీర్తనలు/ నవరత్న మాలికా గుచ్చకృతులు రచించారు . ఆ క్రమములో "స్మరణ" విభాగములో "సతతం సంస్మరణానీహ సారసాక్ష భవంతం స్యానందురేశ్వర " నీలాంబరి రాగం, చాపుతాళం ; "స్మర సదామానస బాలగోపాళం" - బిలహరి రాగం , ఆదితాళం ;"స్మర హరి పాదారవిందం ముదానిశం " - సామ రాగం , ఆది తాళం ; "స్మర జనక శుభచరితా అఖిలలోకనాయక " - బేహాగ్ రాగం , మిశ్రచాపు తాళం లో రచించి, నామస్మరణ విశిష్టతను చాటిచెప్పారు. శ్రీ అనంతపద్మనాభస్వామి వీరి ఇష్ట దైవము. వీరి రచనలు ఉత్తమభక్తికి నిర్వచనము.

 సంగీత వాగ్గేయకారులందరు చాలా గొప్ప భగవదుపాసకులు . వీరి రచనలు  పాడినా , విన్నా, వాయిద్యముపై పలికించినా , భగవన్నామ స్మరణ ఫలితం మనకు తప్పక లభిస్తుంది.

                                                                            - శ్రీమతి యామిని సుబ్బలక్ష్మి