అమృతవాహిని

రచయిత : “అమృతవర్షిణి”

సంపుటి 1 సంచిక 1                            అక్టోబర్ 2022

 

అమృతవాహిని... అవునండీ ఆ పేరు వింటేనే ఏదో ఒక తెలియని హాయి మనస్సుకి తాకుతుంది కదూ!. మకరందాన్ని సేవిస్తున్నఅనుభూతి కలుగుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి తీయని అనుభూతి మన పాఠకులకు ఈ సంచికలు చదివిన ప్రతిసారీ కలగాలనే వుద్దేశ్యంతో ఈ శీర్షిక కి ‘అమృతవాహిని అని నామకరణం చేయడం జరిగింది. ఈ సంచికలలో సంగీతపరమైన సమీక్షలు, వ్యాసాలు మొదలైనవి చోటుచేసుకుంటాయి. వీటికి తోడుగా జ్యోతిష, ఆధ్యాత్మిక పరమైన విషయాలు కూడా మున్ముందు దర్శనమిస్తాయి .

 

కర్ణాటక సంగీత రసికులకి కర్ణాటక సంగీతమే ఒక పెద్ద అమృతవాహిని. ఇదే (అమృతవాహిని) పేరుతో కర్ణాటక సంగీతంలో ఒక రాగం వుంది. ఈ రాగంలో రచనలు తక్కువే. కాని, మన అదృష్టం కొద్దీ సద్గురు త్యాగరాజ స్వామి వారు ఈ రాగంలో ఒక చక్కటి రచన చేశారు. ఈ ప్రారంభ సంచికలో మనం ఆ కృతిని కొద్దిగా పరిశీలిద్దాం.  ఈ రాగం మేళకర్త నఠభైరవి(20) జన్యం కింద పరిగణిస్తారు. ఆ కృతి సాహిత్యం ఇక్కడ ఇవ్వబడింది.

 

పల్లవి :

శ్రీ రామపాదమా! నీ కృప చాలునే - చిత్తానికి రావే

అనుపల్లవి :

వారిజభవ సనకసనందన
వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)

చరణం :

దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరును రాల్చగ
శూర! అహల్యను జూచి బ్రోచితి(వి)
ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా! (శ్రీ)

 

ఇది అచ్చంగా శ్రీ రామ పాద స్తుతి. హిందువుల పూజావిధానంలో, ఆచార వ్యవహారాలలో పాదపూజకు చెప్పలేనంత ప్రాముఖ్యత వుంది. శ్రీ రామపాదానికి అలాంటి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఇవ్వటం ఈ కృతిలోని విశేషం .

 

వారిజభవుడు (బ్రహ్మ), సనకసనందనాది మునులు, దేవేంద్రుడు, నారదాదులు  పూజించే శ్రీరామ పాదమా! నీ దయ నాకు చాలును. ఎల్లవేళలా నా మనస్సులో నీ (పాదమే) స్ఫురణే వుండాలని కోరుకుంటున్నాను.

 

ఓ శూరా! ఎట్లా అయితే తాపముతో కన్నీరు కార్చుచు దారిలో శిల అయి పడివున్న అహల్యను నీ (శ్రీరాములవారి) పాదము రక్షించిందో, ఆ విధముగా ఓ రామ పాదమా! తనను అనుగ్రహించి, ధన్యుణ్ణి చేయమని త్యాగరాజుగారి ప్రార్థన.

త్యాగరాజ స్వామి రామ నామం కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో,  అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత శ్రీరామ పాదానికి ఇచ్చారు ఈ రచనలో.  

 

ఈ కృతి పల్లవి ప్రారంభమయ్యే స్వరాలు ఇట్లా వుంటాయి.

 

(స్వరం)        ప ద నీ  దా మ పా ద మా

(సాహిత్యం)            శ్రీ....      రా మ పా ద మా

 

మపాదమా అనేది స్వరాక్షరాల సమూహం. అంటే మపాదమా అనే సాహిత్యానికి అవే  స్వరాలు వుండటం. ఈ రకమైన ప్రయోగాలు త్యాగరాజస్వామి వారి రచనలలో సర్వ సామాన్యం.

 

ఈ కృతిని డాక్టర్ బాలమురళీకృష్ణ గారి గొంతులో ఈ క్రింద ఇచ్చిన లింకు ని క్లిక్ చేసి వినవచ్చును.

https://www.youtube.com/watch?v=RbBna1pzcow

 

ఇదే కోవలో అమ్మవారి పాదాలు, అయ్యవారి పాదాల విశిష్టత గురించి అనేకమంది  వాగ్గేయకారులు, ఇతర కవులు సుప్రసిధ్ధమైన రచనలు చేశారు. ఉదాహరణకు రామదాసు ‘చరణములే నమ్మితి’(కాపీ రాగం), దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం’ (రాగమాలిక), GNB ‘నీ పాదమే గతి’ (నళినకాంతి  రాగం) రచనలు మనం వినే వుంటాం. చరణం అంటే పాదమే. అన్నమాచార్య సంకీర్తన ‘బ్రహ్మ కడిగిన పాదము’.. ముఖారి రాగంలో మనకు పరిచయమే. శ్రీ మహా విష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు ఒక పాదాన్ని ఆకాశంలోకి పెట్టినప్పుడు అది సత్య లోకాన్ని దాటి వెళ్తున్నప్పుడు బ్రహ్మ దేవుడు ఈ పాదానికే అర్చన చేసి తరించారు.

ఇన్ని రీతులలో భగవంతుని చరణాల ప్రాముఖ్యతను కీర్తనల రూపంలో మనకు అందించిన మహానుభావులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ....